ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

  • ఉద్యోగుల బకాయిలను 100 రోజుల్లో విడుదల చేస్తామని హామీ
  • ఈ క్రమంలో తొలి విడతగా రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల
  • ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు శుభవార్త చెప్పింది. పెండింగ్ బకాయిల తొలి విడత మొత్తాన్ని ఇవాళ విడుదల చేశారు. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఉద్యోగ జేఏసీ నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ హామీని నెరవేర్చే దిశగా, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈరోజు తొలి విడతగా రూ. 2,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల మొత్తాన్ని క్లియర్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా పూర్తిగా చెల్లించారు.

ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ. 4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి తమ ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోందని వెల్లడించింది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నదనడానికి ఇది నిదర్శనమని, ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Revanth Reddy
Telangana government
Government employees
Employees welfare
Bhatti Vikramarka
Retired employees

More Telugu News